విశాఖపట్నంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 190 పరుగుల తేడాలో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 79 పరుగులకే కుప్పకూలింది. ఘనవిజయంతో టీమిండియా అభిమానులకు దీపావళి కానుకనందించింది. లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కాగా మిడిల్ ఆర్డర్ కూడా రాణించలేకపోయింది. ఓపెనర్ గుప్తిల్ డకౌట్‌గా వెనుదిరిగగా… ఆ తరువాత క్రీజులోకి వచ్చిన లాథమ్ 19, కానె విలియమ్సన్ 27, టైలర్ 19, పరుగులు చేసి వెనుతిరిగారు. ఆ తరువాత వాట్లింగ్, అండర్సన్, సౌతీ, సోధీ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. నీషామ్ 3, సాంత్నర్ 4, బౌల్ట్ 1 పరుగులు మాత్రమే చేశారు. టీమిండియా బౌలర్లు ఉమేష్, బుమ్రా, యాదవ్ చెరో వికెట్ తీశారు. అక్షర్ రెండు వికెట్లు తీయగా మిశ్రా విజృంభించి ఐదు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్లకు 269 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో రహానే 20, రోహిత్ శర్మ 70, విరాట్ కోహ్లీ 65, ధోనీ 41, జాధవ్ 37, అక్షర్ 24, యాదవ్ 1 పరుగులు చేశారు. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో మరో 9 పరుగులు వచ్చాయి.