సొంతగడ్డపై టీమిండియాకు అగ్ని పరీక్ష. ఇక ఎప్పు డూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఇప్పుడు చావో రేవో పోరుకు సిద్ధమైంది కోహ్లీసేన. ఈ మధ్యకాలంలో టీమిండియా విజయపరంపర కొనసాగిస్తోంది.
భారత జట్టు ఆడుతున్న సిరీస్ లలో ఆదిలోనే విజయాలు సాధించి, సిరీస్ ను సొంతం చేసుకుంటోంది. అయితే ఈ సంప్రదాయానికి కివీస్ చెక్ చెప్పింది. మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది.
ఈ నేపథ్యంలో నేడు పూణే వేదికగా రెండో వన్డే ప్రారంభం కానుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని క్యూరేటర్ తెలిపారు. ఆసీస్ లాంటి అత్యుత్తమ జట్టు భారత జట్టు ప్రదర్శనకు తలవంచిన నేపథ్యంలో కివీస్ సులువుగానే చేతులెత్తేస్తుందని విశ్లేషకులు భావించారు. అందరూ భావించినట్టే ప్రాక్టీస్ మ్యాచ్ లలో కివీస్ ఆటగాళ్లు తేలిపోయారు. దీంతో భారత జట్టు విజయం ఖాయమని అంతా భావించారు.
అయితే, తొలి వన్డేలో కివీస్ ఆటగాళ్లు టీమిండియాకు షాక్ ఇచ్చారు. సమష్టిగా రాణించి విజయం సాధించారు. సిరీస్ లో కివీస్ ఒక విజయంతో ముందంజలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించి సిరీస్ పై ఉత్కంఠ పెంచాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.
రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు అద్భుతంగా ఉన్నాయి. ఫీల్డింగ్ విషయంలో కివీస్ ఆటగాళ్లు మెరుగ్గా ఉన్నారు. ఈ క్రమంలో విజయం ఎవరిని వరిస్తుందా? అని ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది.