IND vs NED:పసికూనే .. కానీ జాగ్రత్త!

41
- Advertisement -

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ను నేడు నెదర్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మద్యాహ్నం 2 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇక ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన అన్నింట్లోనూ విజయం సాధించి గ్రాండ్ గా సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక నేడు నెదర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్ లోకి అడుగు పెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం టీమిండియా అన్నీ విభాగాల్లోనూ అత్యంత పటిష్టంగా ఉంది.

అయినప్పటికి నెదర్లాండ్ జట్టునూ తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా వంటి బలమైన జట్టునూ మట్టికరిపించిన రికార్డ్ నెదర్లాండ్ ఖాతాలో ఉంది. అందువల్ల ఈ అండర్ డాగ్ జట్టునూ ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన రోహిత్ సేనకు గట్టి షాక్ తగిలే అవకాశం లేకపోలేదు. ఈ మ్యాచ్ నూ సెమీస్ కు ముందు మంచి బూస్టప్ లా భావించి భారీ విజయాన్ని నమోదు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. హిట్ మ్యాన్ ఏ మాత్రం చెలరేగిన రికార్డుల మోత మోగడం ఖాయం.

ఇక శుబ్ మన్ గిల్ కూడా అదే ఫామ్ లో ఉన్నాడు. ఆ తరువాత కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ మ్యాచ్ విన్నర్ లా నిలుస్తూ రికార్డ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 49 సెంచరీ సాధించి సచిన్ రికార్డ్ ను కూడా సమం చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించి వన్డే లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి. అటు బౌలింగ్ లో షమి, సిరాజ్, బుమ్రా.. అదే జోరు కొనసాగిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు. మరి పసికూన నెదర్లాండ్ పై టీమిండియా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:కెప్టెన్‌గా శివాజీ నెత్తిన కిరీటం

- Advertisement -