అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీదేవి.. హీరోయిన్‌గా 16 ఏళ్ల వయసు సినిమాతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. అయితే శ్రీదేవి మృతిపై ఆమె మొదటి హీరో(పదహారేళ్ల వయస్సు సినిమాలో హీరో) చంద్రమోహన్ స్పందించారు.
ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చంద్రమోహన్ అన్నారు. బాలనటిగా మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న వాళ్లు చాలా తక్కువని ఆయన చెప్పారు. తన ఒడిలో ఆడుకున్న శ్రీదేవి.. తర్వాత కాలంలో తన సినిమాతోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె పక్కన నటించినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. పెళ్లి తర్వాత కూడా బోనీకపూర్ దగ్గరకు తీసుకెళ్లి నా తొలి హీరో ఈయనే అంటూ నన్ను పరిచయం చేసింది. ఆమెతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీదేవి తల్లిదండ్రులతోనూ నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అని చంద్రమోహన్ తెలిపారు.