చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్!

5
- Advertisement -

మే నెలలో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ సమయంలో తాము మధ్యవర్తిత్వం చేశామని చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ సమయంలో మూడో వ్యక్తి జోక్యం లేదని, ఆపరేషన్ సిందూర్ అనంతరం కాల్పుల విరమణకు పాకిస్తాన్‌నే అభ్యర్థించిందని భారత్ స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా కూడా అలాంటి ప్రకటన చేయడం గమనార్హం. అయితే భారత్ తన సుదీర్ఘకాల విధానాన్ని మరోసారి స్పష్టంచేస్తూ, భారత్–పాకిస్తాన్ అంశాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి అవకాశం లేదని పునరుద్ఘాటించింది.

మధ్యవర్తిత్వంపై భారత్ వైఖరి ఎప్పటికీ స్పష్టం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. పాకిస్తాన్‌నే కాల్పుల విరమణ కోసం భారత డీజీఎంఓను సంప్రదించింది అని వెల్లడించింది.

‘అంతర్జాతీయ పరిస్థితులు–చైనా విదేశాంగ విధానం’ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలతో పాటు పలు అంతర్జాతీయ వివాదాల్లో చైనా మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందని వ్యాఖ్యానించారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మే నెలలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత సంధికి మూడో వ్యక్తి పాత్ర ఉందన్న వాదనలను భారత్ పదేపదే తిరస్కరిస్తోంది.

Also Read:న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

 

- Advertisement -