రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై విధించాల్సిన ఆంక్షలు, సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆంక్షలు, సుంకాల అమలు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్, చైనా సహా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే పలు దేశాలకు ఊరట లభించనుంది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ ఈ మినహాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు అమల్లోకి రావడానికి ఒక్క రోజు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మినహాయింపు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని కాంగ్రెస్‌కు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
లిండ్సే ఓ. గ్రాహం పేరుతో రూపొందించిన ‘సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్’ ప్రకారం.. రష్యాపై విస్తృత ఆంక్షలు విధించడంతోపాటు, ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు లభించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన గ్రాహం.. రష్యాకు ఆర్థికంగా సహకరించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో డిమాండ్ చేశారు.
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు నిలిపివేయాలని కోరారు. అయితే, దేశ ఆర్థిక ప్రయోజనాలు, ప్రజల అవసరాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.ఇటీవల రష్యాతో కుదిరిన ఒప్పందం ద్వారా అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ వెల్లడించారు. నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల డీజిల్ సరఫరా అవుతుందని పేర్కొన్నారు.
Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్

