ఇంగ్లండ్‌పై భారత్ విజయం.. సిరీస్‌ కైవసం..

67

ఆదివారం ఇంగ్లండ్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. భారత్ విసిరిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ లక్ష్యఛేదన దిశగా సాగుతున్నట్టు అనిపించినా శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ ను మలుపుతిప్పాడు. కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ దూకుడుకు కళ్లెం వేశాడు. ఒకే ఓవర్లో బెయిర్ స్టో, మలాన్ లను అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో మలాన్ (68) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ బట్లర్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. అయితే మిడిలార్డర్ లో బెయిర్ స్టో (7), కెప్టెన్ మోర్గాన్ (1), బెన్ స్టోక్స్ (14) విఫలం చెందడం ఇంగ్లండ్ ఛేజింగ్ అవకాశాలను దెబ్బతీసింది. ఇదే అదనుగా భారత్ ఒత్తిడి పెంచడంతో ఆ జట్టు గెలుపుకు 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖర్లో శామ్ కరన్ 2 సిక్సులు బాదినా అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, శార్దూల్ ఠాకూర్ 2, హార్దిక్ పాండ్య 1, నటరాజన్ 1 వికెట్ తీశారు. అంతకుమందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 80 నాటౌట్, రోహిత్ శర్మ 64 పరుగులతో రాణించారు.

ఇక, భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడనున్నాయి. తొలి వన్డే మార్చి 23న, రెండో వన్డే మార్చి 26న, మూడో వన్డే మార్చి 28న జరగనున్నాయి. ఈ మూడు వన్డే మ్యాచ్ లకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.