రాజ్ కోట్ వేధికగా 15న ( రేపు ) టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మద్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్ కోట్ చేరుకున్నాయి కూడా. తొలి రెండు టెస్టులలో చెరో విజయాన్ని సొంతం చేసుకొని 1-1 తో సమంగా నిలిచాయి. దీంతో మూడో టెస్టులో పైచేయి కోసం ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే మూడో టెస్టులో భాగంగా టీమిండియా కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిందేనని చెబుతున్నారు క్రీడావిశ్లేషకులు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులలో ఘోరంగా విఫలం అయ్యాడు. దాంతో మూడో టెస్టుతోనైనా అతడు ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఫామ్ లోకి రాకపోతే అతడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్ లలో రోహిత్ శర్మ పెద్దగా రాణించడం లేదు. .
ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లీష్ జట్టును బెంబేలెత్తిస్తున్నాడు. కానీ బుమ్రాకు తోడు మరే ఇతర బౌలర్ కూడా సహకారం అందించడం లేదు. మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ వంటివారు పెద్దగా రాణించడం లేదు. దాంతో మూడో టెస్టులో బౌలింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టక తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే గాయం కారణంగా రెండోటెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కానుండడంతో వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్,దృవ్ జూరెల్ వంటి యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తే పటిష్టమైన బౌలింగ్ దళం ఉన్న ఇంగ్లీష్ జట్టును ఈ కొత్త ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆందోళన కలిగించే అంశమే. మొత్తానికి మూడో టెస్టులో ఆయా విభాగాల్లోని లోపాలను సరిదిద్దుకోకపోతే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read:హ్యాపీ వాలెంటైన్స్ డే..