భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆసీస్. బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో విజయం సాధించి 2-0 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలిటీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్‌వెల్ రెండో టీ20లో ఏకంగా సెంచరీతో ఆసీస్‌ని విజయతీరాలకు చేర్చి భారత గడ్డపై ఆసీస్‌కు తొలి టీ20 సిరీస్‌ని అందించాడు.
భారత్ విధించిన 191 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 22 పరుగులకే రెండు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్న షార్ట్,మ్యాక్స్ వెల్ తొలుత నెమ్మదిగా ఆడినా తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. షార్ట్ 40 పరుగులు చేయగా మ్యాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47) దూకుడుగా ఆడగా.. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్), ధోనీ (23 బంతుల్లో 40) సిక్స్‌ల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.