కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్ సీ) తన పేరును మార్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక. ఆ రాష్ట్రాలలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలకు అనుగుణంగా పీఎంపీ అని మార్చుకోవాలని అన్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ 104, కాంగ్రెస్, 78, జేడీఎస్ 38, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే బీజేపీ 100 స్థానాలకుపై గెలుపొందిందన్నారు. ఈవీఎంలతో కాకుండా.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు సిద్దమా..? అని బీజేపీకి సవాల్ విసిరారు. అప్పుడు బీజేపీ సత్తా ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కి పాల్పడిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.