ఇమ్రాన్ ఖాన్‌ సోదరి అరెస్ట్!

4
- Advertisement -

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను కలవనివ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రావల్పిండిలోని అదియాలా జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.

మార్చి 24న ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌కు వారానికి రెండు సార్లు — మంగళవారం, గురువారం — కుటుంబ సభ్యులు, పార్టీ ప్రతినిధులు కలుసుకునే అనుమతి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఆ ఆదేశాలను పాటించడం లేదని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. మంగళవారం మరోసారి ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన సోదరీమణులు, పార్టీ నేతలకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో అదియాలా జైలు బయట కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో నిరసనకు నాయకత్వం వహించిన అలీమా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మీడియాతో మాట్లాడిన అలీమా ఖాన్, తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని, జైలు ప్రాంతం విడిచి వెళ్లబోమని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబ సభ్యులు కలవకుండా అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారని అలీమా ఖాన్ తెలిపారు. “ఇమ్రాన్ ఖాన్ సూచనల ప్రకారం ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. అందుకే రోడ్లపైకి వచ్చాం అని ఆమె పేర్కొన్నారు. పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రం రాజా మాట్లాడుతూ, ఖైదీలకు కుటుంబ సభ్యులను కలిసే హక్కు మౌలిక మానవ హక్కు అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఒంటరి నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. సమావేశానికి అనుమతి నిరాకరించినా, నిరసన తెలపడానికి జైలుకు వస్తూనే ఉంటామని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తూ అదియాలా జైలులో ఉన్నారు. అదనంగా, 2023 మే 9న జరిగిన ఆందోళనలకు సంబంధించిన ఉగ్రవాద నిరోధక చట్టం కేసుల్లో కూడా ఆయనపై విచారణ కొనసాగుతోంది. జైలులో ఆయన ఆరోగ్యం, భద్రతపై పీటీఐ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read:న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

 

- Advertisement -