ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గత ఏప్రిల్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరం జీడీపీ 8.2 శాతం ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయంగా అననుకూల పరిస్థితులు, పెరిగిన ధరలను నియంత్రించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపోరేట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జీడీపీ తగ్గిపోతుందని తాజా వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటుపై మరింత తగ్గనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ కేవలం 6.1 శాతానికి పరిమితవుతుందుని ఐఎంఎఫ్ వెల్లడించింది.
అంతకుముందు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ అంచనాల్లో కోత పడనున్నట్టు తెలిపాయి. 7.5 నుంచి 7.2 శాతానికి భారత్ జీడీపీని కుదిస్తున్నట్లు గత గురువారం ఏడీబీ ప్రకటించింది. ఆహార, ఫ్యూయల్ ధరలు పెరగడం భారత వృద్ధిరేటుకు ప్రతిబంధకాలుగా మారాయని తెలిపింది.
ఇక ఫిక్కీ మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది జీడీపీ ఏడు శాతమేనని తేల్చేసింది. ఇది అంతకుముందు ఫిక్కీ అంచనా వేసిన 7.4 శాతం, ఆర్బీఐ అంచనా వేసి 7.2 శాతం కంటే తక్కువ. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రభావంతో ధరలు పెరిగిపోయి, వినియోగదారుల డిమాండ్ పడిపోతుందన్నదని ఆందోళన వ్యక్తం చేశాయి.