రోహిణి కార్తె..తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

384
high temparature
- Advertisement -

రోహిణి కార్తె సమీపిస్తుండడంతో రాష్ట్రంలో దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు, ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈనెల 25న రోహిణి కార్తె రానుండటంతో  ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని… వేడివల్ల డీహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు వైద్యులు. వేడి నుంచి కొంత ఉపశమనం కోసం లేత రంగులో ఉండే వదులైన దుస్తులు ధరించాలని సూచించారు.

ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం అని…. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలని సూచిస్తున్నారు.

పిల్లలను ఎక్కువ సేపు ఎండలో ఆడనివ్వవద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పిల్లలతో బయటకు వెళితే..వెంట మజ్జిగ, గ్లూకోజ్ లాంటివి తీసుకెళ్లాలన్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు గది వాతావరణం కొంత చల్లగా ఉండేలా కిటికీలకు వట్టివేళ్లు లాంటివి కట్టి.. నీరు చల్లడం లాంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు. నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్ని రకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి, తెల్లని రంగు కల్గినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది.

- Advertisement -