యుక్త వయసు వచ్చిన యువతీ, యువకులకు మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే వారు తెగ ఇబ్బంది పడిపోయి రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. యవ్వనంలో మొటిమలు వస్తే, అది భవిష్యత్తులో మేలు చేస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ సరికొత్త అధ్యయనంలో తేల్చారు. యుక్త వయసులో మొటిమలు రావడాన్ని అదృష్టంగా భావించాలని సలహా ఇస్తున్నారు. మొటిమలు వచ్చిన వారికి వయసు పెరగడం వల్ల కలిగే చర్మపు సహజ మార్పులు ఆలస్యంగా వస్తాయని లండన్ లోని కింగ్స్ కాలేజీ జెనెటిక్ ఎపిడమాలజీ విభాగం ప్రొఫెసర్లు పేర్కొన్నారు. వీరి చర్మం ఆలస్యంగా ముడతలు పడుతుందని, దీనివల్ల మరింతకాలం పాటు యవ్వనంగా కనిపిస్తారని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ సిమోన్ రిబెరో వ్యాఖ్యానించారు. ఈ పరిశోధన గురించిన పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ముద్రితమయ్యాయి.
Also Read:మలబద్దకం…పరిష్కారాలు..
మొటిమలు వచ్చిన, మొటిమలు రాని కొంతమంది మహిళల జన్యు సమాచారాన్ని తీసుకుని వీరు అధ్యయనం నిర్వహించారు. ఇందులో మొటిమలువచ్చినవారి టెలోమీర్స్ (క్రోమజోముల క్యాప్‌లు) పొడుగ్గా ఉన్నట్టుగా గుర్తించారు. ఇలా ఉండటం వలన వీరిలో వయసుతో పాటు కణాలు క్షీణించడం తక్కువగా ఉంటుంది. అందుకే వయసు పెరిగినట్టుగా కనిపించరు.
పొగతాగేవారిలో, ఎక్కువగా బరువున్న వారిలో టెలోమీర్స్ త్వరగా పొట్టిగా అయిపోవటం గమనించారు. అందుకే సిగరెట్లు తాగేవారు, అధికబరువున్న వారు తమ వయసుకంటే ఎక్కువ వయసున్నవారిలా కనబడతారు. మొత్తంమీద టెలోమీర్స్ పొడవుగా ఉన్నవారిలోనే మొటిమలు ఎక్కువగా రావటం వలన మొటిమలను భరించినవారు…ఆ తరువాత కాలంలో వయసుమీరినా చిన్నవారిలా కనిపించే మేలుని పొందుతారని శాస్త్రవేత్తలు తేల్చారు.
Also Read:తమలపాకుతో ఉపయోగాలు..