కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రోజుకో ట్వీస్ట్ వెలుగులోకి వస్తుంది. పోలీసులు దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జయరాం హత్య వెనుక మేనకోడలు శిఖ చౌదరి పాత్ర ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జయరాం భార్య పద్మశ్రీ. ఇప్పటికే నందిగామ పోలీసులు శిఖా చౌదరిని అరెస్ట్ చేసి విచారించి ఇందులో ఆమె పాత్ర లేదని తేల్చి చెప్పారు. తాజాగా తన జయరాం హత్య గురించి శిఖా చౌదరి మాట్లాడుతూ మామయ్య హత్యలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. గత నాలుగు రోజుల నుంచి తనను టార్గెట్ చేస్తూ ఎందుకలా ప్రచారం చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జనవరి 29న అమెరికా నుంచి వచ్చిన మామయ్య మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారని తెలిపింది.
తాను చేపడుతున్న ప్రాజెక్ట్ గురించి కొంతసేపు చర్చించి దానికి సంబంధించిన అమెరికా క్లయింట్ ఒకరిని పరిచయం చేశారని చెప్పింది. ఆ క్లయింట్ తో మాట్లాడిన తర్వాత రాత్రి 8గంటలకు మా ఇంటి నుంచి మావయ్య వెళ్లి పోయారని తెలిపింది. జనవరి 30న మావయ్యకు ఆ క్లయింట్ ఫోన్ చేయడంతో ఆ విషయాల గురించి మెయిల్ చేశారని అన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసి తనకు రూ.కోటి కావాలని అడిగారని, మళ్లీ 31న ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేసి మరోసారి గుర్తుచేశారన్నారు. అత్యవసరంగా అంత డబ్బు అవసరం ఎందుకని అడిగితే, ఒకరి దగ్గరి రూ.4 కోట్లు తీసుకున్నానని చెప్పి, దీని గురించి వివరాలు అడిగేలోపే కాల్ కట్ చేశారన్నారు. తాను తర్వాత ఫోన్ చేసి ఎం జరిగిందని అడగ్గా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నానని అతను ఇప్పుడు చాలా ఒత్తిడి చేస్తున్నాడని, అతను నీకు గతంలో బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పాడని తెలిపింది. ఎక్కడున్నావు అంటే అతని సమాధానం చెప్పలేదని ఆ తర్వాత రోజు మామయ్య చనిపోయాడని ఫోన్ వచ్చిందని చెప్పింది.
ప్రమాదం గురించి కోస్టల్ బ్యాంకుకు ఎండీగా చేసిన వ్యక్తికి ఫోన్ చేసి ఆరా తీశానని, అప్పటికీ అది హత్య అని తనకు తెలియదన్నారు. మామయ్య తీసుకెళ్లిన తన ప్రాజెక్టు ఫైల్‌ను తీసుకోవడానికే వాళ్లింటికి వెళ్లానని, అది తప్ప మరే కాగితాలు అక్కడి నుంచి తేలేదని స్పష్టం చేసింది. జగ్గయ్యపేటలో ఉన్న భూమి పత్రాలు తీసుకోవడానికి వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. తనకు రాకేష్ అనే వ్యక్తితో 2017లో పరిచయం అయ్యిందని టెట్రాన్ అనే కంపెనీలో కార్మికులతో సమస్య వచ్చినపుడు తాను పరిష్కరిస్తానని వచ్చినపుడు పరిచయమయ్యడని తెలిపింది. అప్పటికి మావయ్యకు అతను తెలియదని, నాతో రాకేష్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడని తెలిపింది. అతడి ప్రవర్తన నచ్చక 9 నెలల నుంచి దూరం పెట్టానని, మావయ్య కలిసినప్పుడు కూడా దీని గురించి చెప్పి రాకేశ్ నెంబరు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టమని సలహా ఇచ్చినట్టు శిఖా తెలియజేసింది. కానీ మామయ్య రూ.4కోట్లు తీసుకుంది రాకేష్ దగ్గరే అని నాకు ఇప్పుడు తెలిసిందని తెలిపింది శిఖా చౌదరి.