ఒక్కటైన ఐడియా-వోడాఫోన్‌..

192
Idea Cellular, Vodafone to merge
Idea Cellular, Vodafone to merge
- Advertisement -

భారత మొబైల్ నెట్‌వ‌ర్క్‌ మార్కెట్లో ఉన్న తీవ్రపోటీని తట్టుకోవటానికి టెలికాం కంపెనీలు చేతులు కలుపుతున్నాయి. టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని భావిస్తున్న దేశీయ టెలికాం దిగ్గజం భార‌తి ఎయిర్‌టెల్‌, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన‌ జియోకు గ‌ట్టి పోటీ ఎదురుకాబోతుందా? అంటే అవునంటున్నాయి టెలికాం వ‌ర్గాలు. దేశంలో టాప్‌-3లో ఉన్న‌ రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్ సంస్థ‌ల విలీనాన్ని ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌స్తుతం రెండు సంస్థ‌ల మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 40 కోట్ల‌కు చేరింది. అంటే దేశంలో ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు ఈ సంస్థ‌ల‌కు చెందిన‌వారే. దేశంలో అతిపెద్ద నెట్‌వ‌ర్క్ త‌మ‌దేన‌ని ఈ సంస్థ‌లు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాయి.

రిల‌యెన్స్ జియో, భార‌తీ ఎయిర్‌టెల్‌ల‌కు ఇప్పుడీ సంస్థ‌లు దీటుగా నిలుస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది క‌ల్లా ఈ విలీనం పూర్త‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఈ విలీనం వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వ డిజిట‌ల్ ఇండియా విజ‌న్ సాకారం చేయ‌డానికి ఆదిత్య బిర్లా గ్రూప్ త‌న‌వంతు పాత్ర పోషించ‌నుంద‌ని గ్రూప్ చైర్మ‌న్ కుమార మంగ‌ళం బిర్లా అన్నారు.

ఈ విలీనం త‌ర్వాత సంస్థ‌లో వొడాఫోన్ వాటా 45.1 శాతం. అందులో 4.9 శాతాన్ని(రూ.3874 కోట్లు) వొడాఫోన్ ఐడియా ప్ర‌మోట‌ర్లు, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంద‌ని ఐడియా ప్ర‌క‌టించింది. ఐడియా వాటా 26 శాతంగా ఉంటుంది. అయితే భ‌విష్య‌త్తులో వొడాఫోన్ షేర్ల‌ను కొనుగోలు చేసి స‌మాన వాటా పొందే హక్కు ఐడియాకు ఉంటుంది.

బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ప్రకారం ఈ సంయుక్త సంస్థ ఆదాయం దాదాపు రూ.80,000 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తం మార్కెట్లో 40శాతం సబ్‌స్క్రైబర్‌ రేట్లతో 43శాతం రెవెన్యూ వాటా ఉంటుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యూలర్‌కు చెందిన మొత్తం వాటాలను విలీనం చేయనున్నారు. వీటిలో వొడాఫోన్‌ ఇండియాకు ఇండస్‌ టవర్స్‌లో ఉన్న 42శాతం వాటా కూడా ఉంటుంది. ఇక ఐడియా ప్ర‌మోట‌ర్ల‌కే ఈ కొత్త సంస్థ చైర్మ‌న్‌ను ఎంపిక చేసే హ‌క్కు ఉంటుంది. ఈ విలీనాన్ని భార‌త టెలికాం సెక్టార్‌కి, ఆ సంస్థ‌ల‌కి శుభ‌సూచ‌కంగానే నిపుణులు భావిస్తున్నారు. ఈ విలీన ప్ర‌క‌ట‌న రాగానే ఐడియా షేర్లు ఏకంగా 14 శాతం పెర‌గ‌డం విశేషం.

- Advertisement -