మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రలో 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాభారత సినిమాపై బాహుబలి ప్రభాస్ స్పందించాడు. ప్రస్తుతం బాహుబలి ప్రమోషన్‌లో భాగంగా బిజీగా ఉన్న ప్రభాస్ కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు మహాభారతలో నటించాలనుందని మనసులోని మాటను బయటపెట్టాడు.
అంతేగాదు మహాభారతో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ చాయిస్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత టీం.. ప్రభాస్ ను ఇతర పాత్రలకు కన్సిడర్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ నటించిన బాహుబలి దాదాపు 9000 వేల థియేటర్లలో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
కాగా ఈ సినిమాను 2018లో మొదలుపెట్టి 2020 నాటికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. వీఎ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి సైతం తన జీవిత లక్ష్యం మహాభారతం సినిమా తీయడమే…. అని పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు మహాభారతాన్ని తీసిన తాను మాత్రం తెరకెక్కించడం ఖాయమని జక్కన్న ఇదివరకే స్పష్టం చేశారు.