జిహెచ్ఎంసి ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగానే టిఆర్ఎస్ ఘన విజయం సాధించబోతున్నది. వంద సీట్లు సాధించి తీరుతుంది. అన్ని సర్వేలు అదే విషయం చెబుతున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. టిఆర్ఎస్ పార్టీని చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడిన్రు. ఒక టైమ్ లో టిఆర్ఎస్ పని అయిపోయింది అని కూడా ప్రచారం చేసిన్రు. అలాంటి సమయాల్లో టిఆర్ఎస్ పార్టీ లేచి దెబ్బకొడితే నషాళాన్ని అంటింది వాళ్లకు. టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ఓ శక్తివంతమైన రాజకీయ ప్రబల శక్తి అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ప్రతీ దాంట్లోనూ టిఆర్ఎస్ గొప్ప విజయాలు సాధించింది. ప్రతీ సారీ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా గెలుస్తాం. హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయలతో గడిచిన ఆరేడు ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనేక కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల నిర్మాణం జరిగింది. ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. పేదల కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. జీవో నెంబర్ 58 ద్వారా పేదల ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేశాం. 50 వేల మందికి ప్రతీ రోజూ 5 రూపాయలకే భోజనం పెడుతున్నం. ఇంకా అనేక కార్యక్రమాలు జరియి. జరుగుతున్నాయి. వాటన్నింటినీ ప్రజలు చూస్తున్నారు. మాయ మాటలకు, తప్పుడు ప్రచారానికి హైదరాబాద్ నగర ప్రజలు పడిపోయే వాళ్లు కాదు. తప్పక నిజాలు గ్రహిస్తారు. తప్పుడు ప్రచారాలతో అబద్ధాలను నిజంగా భ్రమింపచేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. వాటిని టిఆర్ఎస్ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఆలవాలమయిన ప్రాంతం. అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నారు. చేతగాని నేతల వల్ల కొన్ని సార్లు మత కల్లోలాలు వచ్చాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో హైదరాబాద్ ప్రశాంతంగా నిద్రపోతున్నది. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నగరానికి పెట్టబడులు తరలి వస్తున్నాయి. అమెజాన్ కంపెనీ ఒక్కటే 21 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. మొత్తంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు’’ అని కేసీఆర్ అన్నారు.
ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా? అగ్గిమండే హైదరాబాద్ కావాలా? మత కల్లోలాల హైదరాబాద్ కావాలా? మత సామరస్యం వెల్లివిరిసే హైదరాబాద్ కావాలా? మతం పేర కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా? అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండే హైదరాబాద్ కావాలా? హైదరాబాద్ నగరంలో అభివృద్ది కావాలా? అశాంతి రాజ్యమేలాలా? ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.‘‘తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలిచే టిఆర్ఎస్ మార్కు పనులు చాలా జరిగాయి. దేశమంతా అబ్బుర పడే విధంగా మిషన్ భగీరథ పథకం తెచ్చాం. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, నేడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అన్ని వర్గాలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రశ్రేణిలో ఉంది. 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటు పెట్టుబడులను అనుమతించాలని కేంద్రం చెప్పినా మనం వినలేదు. ఆర్టీసీని కాపాడుకున్నాం. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నాం. రైతులు, పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు, కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ప్రజలే కేంద్రంగా ఇక్కడ పాలన సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్షగా నిలుస్తున్నది. కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడే విధంగా టిఆర్ఎస్ క్రియాశీలపాత్ర పోషించనున్నది. బిజెపి, కాంగ్రెస్ దొందూ దొందే అన్నట్లున్నవి. రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలి. దేశం నూతన మార్గం పట్టాలి. ప్రపంచ యువకుల్లో 40 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. అంత గొప్ప శక్త సంపన్నమైన దేశం. వనరులున్న దేశం. అభివృద్ధికి అవకాశం ఉన్న దేశం. ఈ దేశానికి మంచి దిశానిర్దేశం కావాలి. మంచి నాయకత్వం కావాలి. ఇప్పటి విధానాలకు ప్రత్యామ్నాయం కావాలి. ఈ విషయంలో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ఓ చోదక శక్తిగా టిఆర్ఎస్ పనిచేస్తుంది. దిక్కుమాలిన, సంకుచిత ఆలోచనలతో దేశాన్ని నడిపే శక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత టిఆర్ఎస్ పార్టీపైనా, తెలంగాణ రాష్ట్రంపైనా ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.