ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైడ్రా అధికారులు కఠిన చర్యలకు దిగారు. ఆ ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం, ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో అనేక దుకాణాలు, షోరూమ్‌లలో తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ రూల్స్‌ను పూర్తిగా విస్మరించినట్టు అధికారులు గుర్తించారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు మూసివేయడం, అధికంగా విద్యుత్ లోడ్ వాడటం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
నిబంధనలు పాటించని నీరూస్ వస్త్ర దుకాణంతో పాటు నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపును హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని, లేనిపక్షంలో దుకాణాల మూసివేతతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇలాంటి తనిఖీలు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని, ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
Also Read:ఈ అలవాట్లతో మెరుగైన ఆరోగ్యం!

