హైదరాబాద్ లాండ్ మార్క్‌గా దుర్గం చెరువును తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని దుర్గంచెరువు సమగ్రాభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసిన కేటీఆర్ చెరువు అభివృద్దిలో భాగంగా వేలాడే వంతెనతో పాటు సుందరీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. కుతుబ్ షాహీల కాలంలో 184 ఎకరాల ఆయకట్టు గల దుర్గం చెరువు కాలక్రమేణా కబ్జాలకు లోనై మురికి కూపంలా మారింది. తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువు అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 187.50 కోట్లు కేటాయించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగర చారిత్రక సంపదను, ప్రకృతి వనరులను కాపడుకొంటామన్నారు.
జూబ్లీహిల్స్-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు దుర్గం చెరువుపై ప్రతిపాదిత వేలాడే వంతెన ఎంతగానో దోహదపడుతుంది. ఈ వంతెనను 365.85 మీటర్ల పొడవు, ఇరువైపులా తొమ్మిది మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ వంతెన వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు హైటెక్‌సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. దీంతో పాటు మరో రూ. 3.5కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు కూడా చేపడుతున్నారు.
రెండేళ్లలో పూర్తికానున్న ఈ వంతెన వినియో గంలోకి వస్తే ఐల్యాబ్స్ జంక్షన్(ఇనార్బిట్‌మాల్ చివర) నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు కొత్త అనుభూతితో కూడిన ప్రయాణ సదుపాయం కలగనుంది. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఈ బ్రిడ్జి ఆకట్టుకోనుంది. ముంబై, గోవా, కోల్‌కతా, జమ్మూకశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది.
దాదాపు రూ.2 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ 2.2 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే పార్కు, యోగా కేంద్రం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. వీటితోపాటు రూ.90 లక్షలతో గణేశ్ నిమజ్జనాలకు ప్రత్యేక కొలను నిర్మించనున్నారు. దీనిలో 3 వేలకు పైగా చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు.