సీసీఎల్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం

11
- Advertisement -

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)కు ఆతిథ్య‌మిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబువుతుంద‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. ఈ లీగ్ తొలి అంచె మ్యాచ్‌లు షార్జాలో జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి 3 తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న రెండో అంచె పోటీలు హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ లీగ్‌లో ఆడేందుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు హైద‌రాబాద్ విచ్చేస్తున్నార‌ని చెప్పారు.

ఈ మ్యాచ్‌ల‌ను హైద‌రాబాద్, తెలంగాణ కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా చూపించాల‌నే త‌న తాప‌త్ర‌యంతో సీసీఎల్ వారిని కోర‌గా, అడ‌గ్గానే అంగీక‌రించార‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు తెలిపారు. దీంతో రోజుకు ప‌ది వేల మంది కాలేజీ (ఇంట‌ర్మీడియేట్‌, డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్‌, మెడిక‌ల్‌) విద్యార్థుల‌ను స్టేడియంలోకి ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని చెప్పారు. ఆస‌క్తి గ‌ల క‌ళాశాల‌ల‌ ప్రిన్సిపాల్స్ హెచ్‌సీఏ ఈమెయిల్ ‌hca.ccl2024@gmail.com కు త‌మ విద్యాసంస్థ‌ల నుంచి ఎంత మంది వ‌స్తున్నారో విద్యార్థుల పేర్ల‌తో స‌హా ఈమెయిల్ చేయాల‌ని సూచించారు. స్క్రూట్నీ అనంత‌రం త‌మ సిబ్బంది వారికి ప్ర‌త్యుత్త‌రం ఇస్తార‌ని తెలిపారు. మ్యాచ్‌ల‌కు విచ్చేసే విద్యార్థులు ఐడీ కార్డుల‌తో రావాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

హైద‌రాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు. ఇందులో హీరో అక్కినేని అఖిల్ కెప్టెన్సీలోని టాలీవుడ్ టీమ్ తెలుగు వారియ‌ర్స్ కూడా ఆడుతోంద‌ని తెలిపారు. రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్ప‌న మూడ్రోజులు ఆరు మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. ముంబై హిరోస్‌, కేర‌ళ స్ట్ర‌యిక‌ర్స్‌, భోజ్‌పురి ద‌బాంగ్స్‌, బెంగాల్ టైగ‌ర్స్‌, చెన్నై రైనోస్‌, క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌, పంజాబ్ డి షేర్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయ‌ని తెలిపారు. ప్ర‌తి టీమ్ త‌ర‌ఫున ఆయా సినీ ఇండ‌స్ట్రీ సెల‌బ్రెటీలు ఆడ‌నున్నార‌ని జ‌గ‌న్ మోహ‌న్ రావు చెప్పారు.

Also Read:కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి..కేసీఆర్ సంతాపం

- Advertisement -