హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి రోజురోజుకి అపూర్వ స్పందన వస్తోంది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజురోజుకి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోతోంది.
ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకో మెట్రో సర్వీస్ నడుస్తుండగా ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించారు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇకపై పీక్ హవర్స్ లో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలుని …డిమాండ్ ను బట్టి భవిష్యత్తులో ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ-జూబ్లీ చెక్ పోస్ట్ రూట్ లో మెట్రో సర్వీసుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ-అమీర్ పేట్ రూట్ లో రోజుకి 2.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో సర్వీసులు పెంచడం ద్వారా ఆ సంఖ్య 3లక్షల వరకు వెళ్లొచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ చివరి నాటికి రాయదుర్గ్(మైండ్ స్పేస్ జంక్షన్) రూట్ ప్రారంభం కానుండటంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 3.5లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడంలో మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.