డ్రగ్స్ కేసులో సినీనటుడు రవితేజ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు సిట్ రవితేజను ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో పలు కీలక సమాచారాన్ని రాబట్టింది. కెల్విన్, జిషాన్‌లతో సంబంధాలపై ఆరా తీసింది. ఉదయం నవ్వుతూ సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజ…వెళ్లిపోయే సమయంలో కాస్త ముభావంగా కనిపించాడు. మీడియాకు చేతులు జోడిస్తూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు.
సుదీర్ఘ కాలం విచారణ ఎదుర్నొన్న రవితేజ లంచ్ కూడా చేయలేదు. సిట్ అధికారులు బ్లడ్ శాంపిల్స్ అడుగగా, రవితేజ నిరాకరించినట్టు సమాచారం. డ్రగ్స్ తెప్పించి ఎవరికైనా సరఫరా చేశారా… చిత్రపరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడతారు..అన్న అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పబ్ లకు వెళ్లే అలవాటు లేదని… షూటింగ్ లేని సమయల్లో యూనిట్ సభ్యులంతా చిన్న పార్టీ చేసుకుంటామని తెలిపినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ పూరీ ద్వారానా పరిచయం అయ్యారంటే సరిగా ఉంటుందా? అంటూ రవితేజ సిట్ కు సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది.
శ్రీనివాసరాజుతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? శ్రీనివాసరాజు ద్వారా ఏమైనా డ్రగ్స్ తెప్పించుకున్నారా? అనే అంశంపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తన సొంత తమ్ముడైన భరత్‌ని డ్రగ్స్ అలవాటు కారణంగా దూరం పెట్టిన తాను డ్రగ్స్ ఎందుకు తీసుకుంటాను అని అధికారులకు రవితేజ వెల్లడించాడని సమాచారం. ఇక.. శనివారం… డ్రగ్స్ కేసులో పదో రోజు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ను సిట్ విచారించనుంది.