మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కోసం బీసీసీఐ ఆరు నగరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ నగరాలను షార్ట్‌లిస్ట్ చేశారు.అయితే ఇందులో హైదరాబాద్ పేరు మాత్రం లేదు. అయితే ఈ నగరాలతో పోలిస్తే నిజానికి హైదరాబాద్‌లోనే కొవిడ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఐపీఎల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.
తాము తీసుకున్న కొవిడ్ కట్టడి చర్యల కారణంగా హైదరాబాద్‌లో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని, ఐపీఎల్ నిర్వహించడానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా స్పందించారు. ఆయన కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి మద్దతు తెలిపారు.
కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి నేను సపోర్ట్ చేస్తున్నాను. బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఐపీఎల్‌ను నిర్వహించే సామర్థ్యం కచ్చితంగా హైదరాబాద్‌కు ఉంది. బయో సెక్యూర్ బబుల్‌ను మేము సిద్ధం చేస్తామని అజారుద్దీన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.