తనపై నమ్మకం ఉంచి హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోకసారి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు శానంపూడి సైదిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార దాహం వల్లే హుజర్ నగర్ లో ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పదవులు తప్ప నియోజక వర్గ అభివృద్దిని ఏనాడు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తానె ఎప్పుడు ఎలక్షన్ల కోసం పనిచేయదని..పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు.
గత ఎన్నికల్లో కేవలం 7వేల ఓట్లతో ఓటమి పాలయినట్లు చెప్పారు. అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్రల వల్ల ట్రక్కు గుర్తుతో ఓడిపోయినట్లు ఆరోపించారు. గత ఎన్నికలకు ఇప్పటికి హుజుర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ధృడంగా ఉంది. 140సర్పంచ్ లకు 102సర్పంచ్ లు టీఆర్ఎస్ కు చెందిన వారే గెలిచారన్నారు. అలాగే మెజారిటీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచినట్లు చెప్పారు. హుజుర్ నగర్ అంటే టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
తాను ఎమ్మెల్యే కావడానికో, ఎంపీ కావడానికో రాజకీయాల్లోకి రాలేదు.. హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నిత్యం ప్రజల మధ్యే తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు.