హుజుర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఒకటి,రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా చోట్ల పోలింగ్ ప్రక్రియ ఆలస్యం కాగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటలకు 31.34 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం 1 గంటలకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జాయింట్ సీఈవో తిరుమల రవికిరణ్ చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. పోలింగ్ కు సంబంధించి మీడియాలో వస్తున్న బ్రేకింగ్ లపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
మటంపల్లి మండలం గుండ్లవల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కీతవారిపాలెంలో బీజేపీ అభ్యర్థి కోట రామారావు ఓటు హక్కును వినియోగించకున్నారు.
మొత్తం ఎన్నికల బరిలో 28 మంది నిలవగా 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.