బాహుబలి సృష్టించిన కలెక్షన్ల సునామీకి టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా సాహో అన్నాయి. బాహుబలిని మించిన సినిమా తీయాలని తమ సినిమా బడ్జెట్ గేట్లు కూడా ఎత్తేశాయి. భారీ బడ్జెట్‌తో సినిమా తీయాలని కోలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పటీనుండో ఎదురుచూస్తుంది. ఆ బాధ్యతను తమిళ దర్శకుడు సుందర్.సి తీసుకున్నాడు. రూ. 250 కోట్ల బడ్జెట్‌తో ఆర్య, జయం రవి తదితరులతో ‘సంఘమిత్ర’సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ టైటిల్ రోల్ సంఘమిత్రలో శృతిహాసన్‌ను తీసుకున్నారు. సంఘమిత్ర కోసం శృతి కత్తిసాము, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్లో సంఘమిత్ర లుక్‌ను విడుదల చేశారు.
ఇక పట్టాలెక్కనున్న సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది శృతి. దీంతో ఈ పాత్ర కోసం బాహుబలి ఫేమ్ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్షీట్స్తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. అయితే తమన్నా .. హన్సికలను ఈ పాత్ర కోసం సంప్రదించగా వాళ్లుకూడా అంతగా ఆసక్తి చూపించలేదట. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్ల పాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే.
ఇక చేసేదేంలేక నయనతారను కూడా అడిగారట. నయనతార ఒకసారి ప్రాజెక్టుకి ఓకే చెబితే, ఒక తపస్సులా దానిని పూర్తి చేస్తుంది. ఇది రెండు సంవత్సరాల పాటు కొనసాగే ప్రాజెక్టు కనుక, నయనతార కమిట్మెంట్.. ఆమెకి గల మార్కెట్ తమకి కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ టాప్ హీరోయిన్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతాం సంఘమిత్రలో రాణి కావాలంటూ బ్రతిమలాడే ధోరణికి దిగారని టాక్. కాగా తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాలషీట్స్ కోరితే సంఘమిత్రలో నటించడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. ఏదేమైనా సంఘమిత్ర దొరకాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.