Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ!

1
- Advertisement -

కరోనా మిగిల్చిన విషాదం, నష్టాన్ని మర్చిపోకముందే.. చైనాలో మరో వైరస్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది, ఇతర దేశాలకూ ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల మధ్య, చలికాలంలో సంభవించే శ్వాసకోశ వ్యాధుల కేసులు గతేడాది కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయని చైనా తెలిపింది. విదేశీయులు బీజింగ్‌కు వెళ్లొచ్చని, ఎలాంటి ప్రమాదమూ, రిస్క్ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. “ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి. కానీ అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది చైనాలో ఇన్ఫ్లుఎంజా A, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తక్కువ స్థాయిలో వ్యాప్తి చెందాయి” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. “చైనాలోని పౌరులు, విదేశీయుల ఆరోగ్యం గురించి చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. చైనాలో ప్రయాణించడం సురక్షితమే” అని తెలిపారు.

రీసెంట్ గా చైనాలో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) అనే వైరస్.. ఇప్పుడు ఇతర దేశాలనూ వణికిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వైరస్ కు సంబంధించిన పోస్టులు, వైరల్ అయ్యాయి. అనేక వీడియోల్లో ఆస్పత్రులు పేషెంట్స్ తో కిక్కిరిసినట్టు కనిపించాయి. ముఖానికి మాస్క్ లతో జనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఇవి నెటిజన్లతో పాటు ఇతరులకూ భయాందోళనలకు గురిచేశాయి, ఆల్రెడీ కొవిడ్ తో నానా అవస్థలు పడిన జనం… మళ్లీ ఆ రోజులు వస్తాయా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో కోల్పోయిన తమ బంధువులు, స్నేహితులను తలచుకుని.. లాక్ డౌన్ వంటి పరిస్థితుల్ని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నివారణ, నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా జారీ చేసిన మార్గదర్శకాలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. చైనాలో మెటాప్న్యూమోవైరస్ వ్యాప్తి గురించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ సమాచారాన్ని అందించారు. ఇది తీవ్రంగా ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. “ఇది పెద్ద ఆందోళనకు కారణమని మేం నమ్మం. ఎందుకంటే ఇది జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాసకోశ వైరస్. కొన్ని సందర్భాల్లో, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ లక్షణాలు కనిపించవచ్చు” అని డాక్టర్ గోయల్ వివరించారు. “కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది అంత అత్యంత తీవ్రమైన వ్యాధి, అనారోగ్యం కాదు. ఎవరూ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చలికాలంలో సాధారణంగానే శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఇందుకు కావల్సిన పడకలు, సౌకర్యాలు చేశాం. దీనికి నిర్దిష్ట యాంటీవైరల్ మందులు అవసరం లేదు. ఈ వైరస్‌కు నిర్దిష్ట మందులు కూడా లేవు” అని అతుల్ చెప్పారు.

Also Read:కాంగ్రెస్ అంటేనే చీటింగ్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్

- Advertisement -