భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పండుగలకు ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగ ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. ప్రతి ఏటా పిల్లల నుంచి పెద్దల వరకు కుల మతాలకు అతీతంగా జరిపుకునే పండుగలలో వినాయక చవితి ముందు వరుసలో ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్ణాధిపతి విఘ్నేషుడిని తలచుకోవడం భారతీయులు పరిపాటిగా అనుసరిస్తున్న ఆచారం. ఎందుకంటే తలపెట్టే పనిలో ఎలాంటి విఘ్నలు లేకుండా ఆ వినాయకుడు చూసుకుంటాడని నమ్మకం. శివుడు పార్వతి లకు జన్మించిన వినాయకుడి పుట్టిన రోజు గుర్తుగా వినాయక చవితిని జరుపుకుంటారు. ప్రతి భాద్రపద మాసంలో శుక్లపక్షమి రోజున వినాయక చవితి వస్తుంది. అయితే చాలమందికి వినాయక చవితి రోజు ఆ విఘ్నేశ్వరుడిని ఎలా పూజించాలనే దానిపై అవగాహన ఉండదు. అందుకే వినాయక చవితి రోజున గణనాథుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం !
వినాయక చవితి రోజున వేకువనే నిద్ర లేచి మొదట పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో మాత్రమే వినాయక విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కుటుంబం అంతా కలిసి శ్రద్దతో షడోశ లేదా అష్టోత్తర నామాలను జపిస్తూ కుటుంబం మొత్తం భక్తి శ్రద్దలతో పూజించాలి. పూజా అనంతరం ఉండ్రాల్లు నైవేద్యంగా పెట్టాలి. పూజ ముగించిన తరువాత అక్షింతలు తలపై చల్లుకొని ఇంట్లో పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. ఇలా గణేశుడిని భక్తితో పూజించాలి.
ఇక నవరాత్రులలో భాగంగా విజ్ఞేషుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలో కూడా తెలుసుకుందాం
మొదటి రోజు వరసిద్ది రూపంలో ఉన్న వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి.
రెండో రోజు వికట రూపంలో ఉన్న వినాయకుడికి అటుకులు నైవేద్యంగా పెట్టాలి.
మూడో రోజు లంబోదల రూపంలో ఉన్న వినాయకుడికి పేలాలు, నాల్గో రోజు గజానన వినాయకుడికి చెరకుగడలు, ఐదో రోజు మహోదర రూపంలో ఉన్న వినాయకుడికి కొబ్బరి కురిడి, ఆరో రోజు ఏకదంత వినాయకుడికి నువ్వులతో చేసిన పదార్థాలు, ఏడో రోజు వక్రతుండ వినాయకుడికి అరటిపండ్లు మరియు ఇతరత్రా పండ్లు, ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుడికి సత్తుపిండి వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చివరగా తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ రూపంలో ఉన్న వినాయకుడికి నేతితో చేసిన అప్పాలు, అలాగే నేతితో చేసిన ఇతరత్రా పిండి వంటకాలు నైవేధ్యంగా పెట్టాలి.
Also Read:KCR: గణనాథుడి ఆశీస్సులతో సుభిక్షంగా తెలంగాణ