రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం ఈ నెల 25తో ముగియనుండడంతో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు ఉభయ సభ సభ్యులు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ప్రణబ్ ముఖర్జీ బెంగాల్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఎదుగుతూ వచ్చారని అన్నారు. ప్రణబ్ రాజకీయనాయకుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, 1969లో ఎంపీ పార్లమెంట్ లో అడుగుపెట్టారని, అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని, ప్రణబ్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని సుమిత్రా మహాజన్ ఆకాంక్షించారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన సభ్యులందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శి, రాజకీయ గురువు ఇందిరాగాంధీ అని, ఆమె మహోన్నత నాయకురాలని అన్నారు. 1969 జులైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, లోక్ సభకు రెండుసార్లు ఎన్నికయ్యానని చెప్పారు. నాడు సభలో తాను అడుగుపెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోథులు, అపర మేథావులు ఉన్నారని గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ బిల్లు తేవడం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని, భిన్న మతాలు, జాతులు, భాషల ప్రజలంతా ఒకే దేశం, ఒకే జెండాగా ఉండటం గర్వకారణమని అన్నారు. అధికార, ప్రతిపక్షల వాగ్యుద్ధాలతో పార్లమెంటు విలువైన సమయం వృథా అవుతోందని ప్రణబ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మోడీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్ కు స్పీకర్ అందజేశారు.