నగరంలో దశాబ్దాల క్రితం వేసిన మురికి నీళ్ల పైపులైన్లను మరమత్తు చేసేందుకు ఏలాంటి తవ్వకాలు అవసరంలేని ట్రెంచ్ లెస్ టెక్నాలజీ(సిఐపిపి)ని వినియోగిస్తున్నట్లు పురపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. దక్షిణ భారతంలోనే మొదటిసారిగా సీఐపీపీ అనే ట్రెంచ్‌లెస్ టెక్నాలజీని వినియోగించి సెవరెజీ పైపుల పునరుద్దరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం రోజున ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఈ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న పనులను అయన పరిశీలించారు.
హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ పైపులైను వ్యవస్థ దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిందని… వాటిని తీసి కొత్త పైపులు వేయడం చాలా కష్టంతో కూడుకున్న పనని మంత్రి అన్నారు. అంతేకాకుండా నగర పౌరులకు ట్రాఫిక్ కష్టాలు కూడా ఏదురవుతాయన్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ జలమండలి నూతన టెక్నాలజీని వినియోగిస్తుందని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మార్గ్‌లో డ్రైనేజీ పైపులైను కుంగిన చోట సీఐపీపీ (క్యూరెడ్ ఇన్ ప్లేస్ పైప్) అనే నూతన విధానంలో డ్రైనేజీ పైపులైనును పటిష్టపరచేందుకు పునరుద్దరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రయోగత్మాకంగా నెక్టెస్ రోడ్ లోని ఎస్టీపీ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు దాఆపు 1.5 కిలోమీటర్ల మేర ఈ పనులు జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్నామన్నారు. ఇందుకోసం రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే నగరంలోని మొత్తం 120 కిలో మీటర్ల మెయిన్ ట్రంక్ లైనును ఈ సీఐపీపీ పద్దతిలో పునరుద్దరిస్తామని తెలిపారు.
ఈ పద్దతి ద్వారా రోడ్డును తవ్వకుండానే డ్రైనేజీ పైపులైను పునరుద్దరణ పనులు చేపట్టవచ్చన్నారు. అలాగే ఇంజనీర్లు, కార్మికులకు శ్రమ తగ్గుతుందని తెలిపారు. అలాగే పైపులైనులు దాదాపు 40-50 సంవత్సరాల పాటు మన్నికగా ఉంటాయన్నారు. అలాగే డ్రైనేజీ పైపులు క్షీణించడానికి ప్రధాన కారణమైన హైడ్రోజన్ సల్ఫేడ్‌తో పాటు పలురకాల వాయువు కారణంగా పైపులైను కోతకు గురికాకుండా ఉంటుందని తెలిపారు. ఈ పద్దతిని ఇప్పటీకే విదేశాల్లో వినియోగిస్తున్నారని వివరించారు. అలాగే పైపు కింది భాగం సమాంతరంగా ఉండడం వల్ల ఎలాంటి ఘన పదార్ధాలు పేరుకుపోవని కేటీఆర్ వివరించారు.
నగరాల్లోని ప్రస్తుతం ఉన్న మౌళిక వసతులను మరింత మెరుగు పనిచేందుకు అవిసరం అయ్యే ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలను ప్రోత్సాహించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సిఐపిపి పరికరాలు, సామాగ్రిపై 30 శాతం కస్టమ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం వేస్తుందని వివరించారు. దీనిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఈ పద్దతి కేవలం రాష్ట్రానికే గాక దేశానికే ఉపయోగపడే టెక్నాలజీ సీఐపీపీ అన్నారు. మన దగ్గరే ఈటెక్నాలజీ సంబంధ వస్తువుల ఉత్పత్తి జరిగితే వ్యయం తగ్గుతుందన్నారు.
మిని ఎయిర్‌టెక్ యంత్రాలను వినియోగించి మానవ రహిత పారిశుద్ద్య పనులు చేపట్టి దేశానికే ఆదర్శంగా జలమండలి నిలిచిందన్నారు. అలాగే సమర్ధవంతంగా మంచినీటిని సరఫరా చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక వినియోగంలో ముందున్న జలమండలి ఎండీ దానకిషోర్, అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిషోర్‌తో పాటు పలువురు జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.