ఈ ఏడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) కమిషనర్ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం తెల్లాపూర్లోని 150 ఎకరాల విస్తీర్ణంలో గల హెచ్ఎండిఏ అర్బన్ పారెస్ట్రీ నర్సరీని కమిషనర్ శ్రీఅర్వింద్కుమార్ సందర్శించారు. అక్కడ హరితహారం కార్యక్రమంలో నాటడానికి సిద్ధంగా పలు సైజుల్లో ఉన్న వివిధ రకాల మొక్కలు, వాటి ఎదుగుదల తీరుతెన్నులను ఆయన పరిశీలించారు.
ఈ ఏడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీకె.తారకరామారావు గారి ఆదేశాలకు లోబడి హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రత్యేక కార్యాచరణతో మొక్కలను సిద్ధం చేస్తున్నది.
హెచ్ఎండిఏ పరిధిలోని ఖాళీ స్థలాలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గ్రీనరీ పెంచేందుకు అనుగుణంగా కోటి మొక్కలకు పైగా హెచ్ఎండిఏ సిద్ధం చేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు కమిషనర్ శ్రీ అర్వింద్కుమార్కు వివరించారు. జిల్లాల నుంచి వచ్చే ప్లాంటేషన్ ఆర్డర్లకు అనుగుణంగా మొక్కలను అందజేసేట్లుగా హెచ్ఎండిఏ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులను ఆదేశించారు.
ఈసారి హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని దాదాపు 500 పార్కులను ట్రీ పార్క్స్గా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను కమిషనర్ శ్రీ అర్వింద్ కుమార్ అర్బన్ ఫారెస్ట్రీ విభాగానికి అప్పగించారు.
ఈ సందర్భంగా గత ఏడాది ఆగస్టు 28వ తేదీన తెల్లాపూర్ నర్సరీలో తాను(అర్వింద్ కుమార్) మియావాకి పద్ధతిలో నాటిన మొక్క(మర్రి) ఎదుగుదల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేవలం ఎనిమిది నెలల కాలంలోనే రెట్టింపుగా మొక్క ఎదుగుదల ఉందని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.
తెల్లాపూర్ నర్సరీ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో అర్బన్ ఫారెస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ. ప్రకాశ్, అర్బన్ ఫారెస్ట్ మేనేజర్ సి.శ్రీనివాస్ తో పాటు పలువురు సిబ్బంది ఉన్నారు.