హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్‌..రైతులకు కాసుల వర్షం

358
HMDA land pooling
- Advertisement -

అహ్మదాబాద్‌ సిటీ తరహాలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో హెచ్‌ఎండీఏ ప్రజా కాలనీలకు శ్రీకారం చుట్టింది. ల్యాండ్ పూలింగ్ పద్దతిలో రైతుల నుండి భూమిని సేకరించి ఉన్నత స్ధాయి ప్రమాణాలతో లే అవుట్లుగా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన స్థలంలో రైతుకు సగం ఇవ్వనున్నారు.

ఈ పథకం ద్వారా కనీసం 50 ఎకరాల నుంచి 500 ఎకరాలు ఆపైన రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తే చాలు. భూమిని హెచ్‌ఎండీఏ తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన భూమిని 50 శాతం రైతుకు ఇస్తారు. మిగిలిన స్థలాన్ని హెచ్‌ఎండీఏ తీసుకుంటుంది. ఇలా రూపొందిన కాలనీలో తమ వాటా కింద వచ్చే స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు ఇళ్లు నిర్మించి హెచ్‌ఎండీఏ లాభాలను గడించనుంది.

కొన్ని సంవత్సరాల క్రితం నాగోల్ మెట్రో స్టేషన్‌ భూసేకరణలో భాగంగా రైతులు హెచ్‌ఎండీఏకు 350 ఎకరాల భూమిని ఇచ్చారు. దీంతో ఇక్కడ అన్ని సౌకర్యాలతో లే అవుట్‌ని నిర్మించింది హెచ్‌ఎండీఏ. రైతుల వాటా స్థలాలు పోను తనవాటా కింద వచ్చిన 67 స్థలాలను నెలరోజుల కిందట హెచ్‌ఎండీఏ వేలం వేయగా దాదాపు రూ.670 కోట్ల మేర నిధులు వచ్చాయి. హెచ్‌ఎండీఏ ఇక్కడ భూమిని అభివృద్ధి చేయకముందు గజం ధర రూ.20 వేలు ఉండగా.. తాజా వేలంలో గరిష్ఠంగా రూ.50 వేలు పలికింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టు పక్కల ఏడు జిల్లాల్లో రైతులు ముందుకు వస్తే ప్రజా కాలనీల నిర్మాణం చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. దీంతో రైతులకు వారిచ్చే భూమిలో సగం భూమితో పాటు కాసుల పంట పండనుంది. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా ప్రతాపసింగారం రైతులు 200 ఎకరాలు ఇవ్వడానికి ముందుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ప్రజా కాలనీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

- Advertisement -