గ్రేటర్ వాసులకు మరో శుభవార్త..ఇప్పటివరకు రెండు ఫేజుల్లో ప్రజలకు అందుబాటులోరకి వచ్చిన మెట్రో త్వరలో మూడో ఫేజ్ ప్రారంభంకానుంది. హైటెక్ సిటీ మెట్రో రైలు సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా హైటెక్ సిటీకి మెట్రో రైలును పరుగులు పెట్టించే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ, రైల్వే శాఖ తుది అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. కారిడార్ 3కి పొడిగింపుగా అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిమీ మార్గాన్ని ఈనెలాఖరుకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మెట్రో సేవలు ప్రారంభమైతే ఐటీ ఉద్యోగులకు అత్యంత సౌకర్యవంతంగా మారడమే కాకుండా హైటెక్ సిటీ పరిసర ప్రాంతా ల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం రెండు కారిడార్‌లలో 46 కి.మీ మేర మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కారిడార్-1లో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో 29 కి.మీ, కారిడార్-3లో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 17 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. కారిడార్-3కి పొడిగింపుగా అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు మధురానగర్, యూసు్‌ఫగూడ చెక్‌పోస్టు, జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మొత్తం 8 మెట్రో స్టేషన్ల నిర్మాణం సైతం పూర్తయింది.