ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన హిమాన్షు..

169

రామయ్య నామస్మరణతో మిథిలా ప్రాంగణం మార్మోగిపోయింది. భద్రాద్రి రామయ్య కల్యాణమహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో పొటెత్తారు. భద్రాద్రి అంతా రామమయమై సాక్షాత్కరించింది. విద్యుత్తు దీపాల వెలుగులతో ఆధ్యాత్మికత అలరారుతూ మరింత శోభితమై దర్శనం ఇవ్వడంతో జైశ్రీరామ్‌ అంటూ నీరాజనాలు పలికారు. గరుడ వాహనంపై రాములోరు, గజవాహనంపై సీతమ్మ, హనుమద్ వాహనంపై లక్ష్మణస్వాములను వీక్షించారు. వేలాది భక్తులతో రామాలయం పరిసరాలు కిక్కిరిశాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా భద్రాద్రి శ్రీసీతారాములకు పట్టువస్ర్తాలు సమర్పించారు. మంత్రి కడియం శ్రీహరి స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అదేవిధంగా టీటీడీ ఈవో స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.

Himanshu offers Talambralu to Rama

ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మనుమడు హిమాన్షు, కుటుంబసభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం కేసీఆర్ తరపున ఆయన మనవడు హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతీ ఏటా శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భద్రాచలం రాములోరికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు.. ముత్యాల తలంబ్రాలు అందించడం సంప్రదాయం. అయితే, ఈ సారి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంతో ఆయన తరపున హిమాన్షు పట్టు వస్త్రాల్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

గతంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు కూడా సీఎం సతీమణి, మనుమడు హాజరయ్యారు. అయితే,ముక్కోటి వేడుకలో పాల్గొనడం ఇదే ప్రథమం. ఆదివారమే భద్రాచలం చేరుకున్న వీరు స్వామివారి తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం వేడుకల్లో పాల్గొన్నారు.

గత సంవత్సరం శ్రీరామనవమి వేడుకల్లో కేసీఆర్ దంపతుల వెంట వారి మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వచ్చాడు. పట్టు వస్త్రాలు కలిగిన పళ్లేన్ని కేసీఆర్ నెత్తికెత్తుకోగా, హిమాన్షు ముత్యాల తలంబ్రాలున్న పళ్లేన్ని తలపై పెట్టుకుని వచ్చాడు. ముందుగా కేసీఆర్ అందించిన పట్టు వస్త్రాలను తీసుకున్న అక్కడి పూజారులు ఆ తర్వాత హిమాన్షు నెత్తిపై ఉన్న ముత్యాల తలంబ్రాలను అందుకున్నారు. ఈ సారి మాత్రం సీఎం కేసీఆర్ తరపున హిమాన్షు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సీఎం కుటుంబ సభ్యులతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.