హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. మొత్తం 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వరుస విజయాలతో ఊపు మీదున్న బీజేపీ.. అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అదే సమయంలో మొన్ననే పంజాబ్‌లో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ సిట్టింగ్ సీటును దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఊపును కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఈ చిన్న రాష్ట్రంలో ఏడు ర్యాలీలలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు సభలలో పాల్గొని ఊపు తీసుకువచ్చారు.
మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది (61 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 31 మందిపై తీవ్ర నేరారోపణలు ఉండడం గమనార్హం. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, 23 మంది బీజేపీ అభ్యర్థులు.