బాలయ్య 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వివాదంలో చిక్కుకుంది. శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బాలయ్య సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు కల్పించిన విషయం తెలిసిందే. కానీ గతంలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి సినిమాకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించినా..ఏపీ ప్రభుత్వం ముందు సానుకూలంగా స్పందించి ఆ తర్వాత ఎలాంటి ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు కల్పించకుండా..ఇప్పుడు బాలయ్య శాతకర్ణి సినిమాకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ కల్పించడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ బంధువు అయినందుకే నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వకుండా..బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు పన్నుమినహాయింపు ఇవ్వడంపై రెండు రోజుల క్రితం రుద్రమదేవి సినిమా దర్శకుడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై చంద్రబాబుకు స్వయంగా లేఖ రాశారు. చారిత్రాత్మక చిత్రాలను ప్రోత్సహించడానికి శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు సంతోషంగా ఉంది. కానీ అలాంటి చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన రుద్రమదేవి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. గౌతమీపుత్రకు ఇచ్చినట్లుగానే రుద్రమదేవికీ ఇవ్వాలని, తాను కట్టిన ట్యాక్స్ చెల్లించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా గుణశేఖర్ ఏపీ చంద్రబాబుకు లేఖ రాయడంతో వివాదం రచ్చకెక్కినట్టైంది.