ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. పరిపాలనలో భాగంగా జారీ చేసే అన్ని ఉత్తర్వులు, సర్క్యులర్లు, నియమ నిబంధనలు, నోటిఫికేషన్లను ఇకపై తక్షణమే తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. జాప్యం లేకుండా జీవోలను వెల్లడిస్తూ పారదర్శకంగా ఉండాలని కోరింది. నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ఉండాలని హైకోర్టు తన ఆదేశంలో పేర్కొంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.
ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న నిర్ణయాలు, విధానాలు, పాలనాపరమైన ఉత్తర్వులపై సమాచారాన్ని తెలుసుకునే హక్కును ప్రభుత్వాలు కాలరాయొద్దని హైకోర్టు అభిప్రాయ పడింది. అది పౌరులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కని వ్యాఖ్యానించింది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని గుర్తు చేసింది. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం వల్ల పాలనలో పారదర్శకత, పాలకులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నది హైకోర్టు ఉద్దేశం. ఒకవేళ ప్రభుత్వ సమాచారం అందుబాటులో లేకపోతే ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుందనీ, తద్వారా అనవసరమైన ఆందోళనలు, న్యాయ పోరాటాలకు ఆస్కారం ఇచ్చినట్లు ఔతుంది అన్నది హైకోర్టు సూచన. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ శాఖలన్నీ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read:నారి నారి నడుమ మురారి..ఎంజాయ్ చేస్తారు!

