చెన్నైని తాకిన ‘వర్ద’ తుఫాన్

256
Tamilnadu and Andhra on very high alert
- Advertisement -

తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తున్న వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది.‘వర్ద’ అతి తీవ్ర తుపాను కొద్దిసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తుపాను కారణంగా చెన్నైకి రోడ్డు, రైలు, విమాన మార్గాల రాకపోకలు నిలిచిపోయాయి.

సోమవారం తెల్లవారుజాము నుంచే మీనంబాకం, చెన్నై విమానశ్రయం పరిసరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులున్న ప్రజలు బయటకు రావద్దని, పనులను వాయిదా వేసుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చెన్నైకు 105కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తీరం దాటే సమయంలో పెనుతుపాను తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. తుపాను తీరం దాటిన అనంతరం 36 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా కొన్నింటినీ దారి మళ్లించారు. తమిళనాడు ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 7357 మంది ప్రజలను 54 సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.

సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగిసి పడుతున్నందున తదుపరి ఆదేశాలిచ్చే వరకు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వారు సూచించారు. తుపాను తీవ్రత దృష్ట్యా కృష్ణపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడు, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

high alert on Tamilnadu and Andhra

తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో అక్కడక్కడ విస్తారంగా, ఇంకొన్ని చోట్ల చెదురుమదురుగా సోమవారం వర్షాలు కురుస్తాయన్నారు.వర్ద తీరాన్ని దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో.. ఉత్తర తమిళనాడులోని తిరువల్లూరు, కాంచీపురంతో పాటు పుదుచ్చేరిలో 20 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవవచ్చని అధికారులు తెలిపారు.

high alert on Tamilnadu and Andhra

వర్ద పరిణామాల నేపథ్యంలో ఏపీ,తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు,తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -