గోదారమ్మ ఉగ్రరూపంతో భద్రాచలం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం నీటిమట్టం 58.50 అడుగులకు చేరడంతో హై అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.
ప్రస్తుతం 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తున్నది. ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.