ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కమెడియన్,హీరో సునీల్‌కి కూడా చోటు దక్కడం విశేషం.
సునీల్ చాలా కాలంగా హీరో పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటం ఆయనని కాస్త డీలాపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ‘ఉంగరాల రాంబాబు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తాను ఆశించిన ఫలితాన్ని అందించడం ఆనందంగా ఉందని సునీల్ చెప్పాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయని అన్నాడు.
చిరంజీవి 150వ సినిమాలోనే తాను చేయవలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన కుదరలేదనీ, ఆయన 151వ సినిమాగా రూపొందుతోన్న ‘సైరా నరసింహా రెడ్డి’లో తనకి చోటు దొరకడం అదృష్టమని చెప్పాడు. ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నానని అన్నాడు. ఇకపై ఒకవైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున కమెడియన్ గాను కనిపిస్తాననీ, విలన్ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం వెనుకాడనని చెప్పుకొచ్చాడు.