సినీ నటుడు,హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పిలిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధ్గంగా ఉన్నానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన సుమన్ అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందని…విపక్షాలు ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయడం తగదన్నారు.
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని…రాత్రికిరాత్రే అభివృద్ధి జరగాలంటే సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నానని.. కేసీఆర్ రాజకీయాల్లోకి రమ్మని తనని ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
జనరంజక పాలన కేసీఆర్‌తోనే సాధ్యపడుతుందని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారన్నారు. దశాబ్దాలుగా సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా నిలిచి పోరాడి రాష్ర్టాన్ని సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని సుమన్ కొనియాడారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఇక్కడ చేపట్టబోయే సంక్షేమ పథకాలకు ఇతర దేశాల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.