ఓవైపు హీరోగా పలు సినిమాలు చేసుకుంటూ..మరోవైపు వేరే సినిమాలలో కీలక పాత్ర పోషిస్తూ బిజిగా ఉన్నాడు హీరో శ్రీకాంత్. చిన్న పెద్ద హీరో అని తేడా లేకుండా అన్ని సినిమాలలో చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా ఆపరేషన్ 2019. పూర్తాగా రాజకీయ నేపథ్యంలో సాగిన ఈసినిమా ట్రైలర్ ను ఇటివలే విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ట్యాగ్ లైన్ గా సినిమా రూపొందిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆపరేషన్ దుర్యోదన, మెంటల్ కృష్ణ లాంటి సినిమాలతో రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు హీరో శ్రీకాంత్. 2019ఎన్నికలే లక్ష్యంగా ఈసినిమాను రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ రాజకీయ నాయకుడిగా నటించాడు.
ట్రైలర్ లో కొన్ని డైలాగ్ లతో శ్రీకాంత్ రెచ్చిపోయాడు. తన కాలు నుంచి జారిన చెప్పును ఓ పోలీస్ అధికారి తొడగుతుండగా ఆయన చెంపను పగులగొట్టే సన్నివేశం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. శ్రీకాంత్ చెప్పిన మరో డైలాగ్ తో రాజకీయ వర్గాలకు సూటిగా చెప్పినట్టు ఉంది. “గాంధీ కడుపున గాంధీ పుట్టడు .. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు .. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు .. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే అంటూ పవర్ పుల్ పొలిటికల్ యాంగిల్ చెప్పేశాడు హీరో శ్రీకాంత్. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా..త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు చిత్రబృందం
.