క్రికెట్ ప్రపంచాన్ని కుదుపేసిన బాల్ టాంపరింగ్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, డేవిడ్ వార్నర్లపై వేటు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో సిద్దార్థ్ సైతం స్పందించారు. స్మిత్,వార్నర్‌లను క్రికెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఆసీస్ క్రికెటర్లు చీట్ చేస్తూ పట్టుబడ్డారు. కానీ వారిని యజమాని కుమారుల్లా చూస్తున్నారు. వారికి ఇది చాలా చిన్న శిక్ష. ఖండాంతర క్రికెట్ జట్టులు ఏ తప్పూ చేయకపోయినా వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. లెహ్‌మాన్, స్మిత్, వార్నర్, బ్యాక్‌క్రోఫ్ట్‌లను క్రికెట్ నుంచి నిషేధించాలి. క్రికెట్‌ని నాశనం చెయొద్దు ఆస్ట్రేలియా అని సిద్దార్థ్ ట్వీట్ చేశారు.
https://twitter.com/Actor_Siddharth/status/978130603332722688
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ ఓ టేపుతో బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని స్మిత్ అంగీకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మిత్‌పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది ఐసీసీ. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అధికారులు విచారణ ప్రారంభించారు. సీఏ నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించొచ్చు.