ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన `చతురంగ వేట్టై` చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు. `జ్యోతిలక్ష్మి`, `ఘాజీ` చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక.
ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ “తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకంఫై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం `చతురంగ వేట్టై`, తెలుగులో రీమేక్ చేశాం. చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు ,వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది“ అని అన్నారు.
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ “ రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ ఛానల్ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే ఘోరాలు, నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్‌గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది “ అని చెప్పారు.
ఆదిత్యామీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్య కృష్ణ, ధన్‌రాజ్, శ్రీరామరెడ్డి , వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, `దిల్` రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి.వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ ,సంగీతం: సునీల్ కాశ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: బ్రహ్మ కడలి, కెమెరా: దాశరథి శివేంద్ర , కో డైరక్టర్: కృష్ణకిశోర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: ఆర్.సెంథిల్, కృష్ణకుమార్,నిర్మాత: రమేష్ పిళ్లై, మాటలు -దర్శకత్వం: గోపీగణేష్ పట్టాభి.