అమెరికాను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాన్ “ఫెర్న్” దేశవ్యాప్తంగా సాధారణ జీవనాన్ని పూర్తిగా స్థంభింపజేసింది. గత 48 గంటల్లోనే 14,000కు పైగా విమానాలు రద్దు కావడంతో విమానయాన రంగం కుదేలైంది. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి, కొందరు రోజుల పాటు అక్కడికక్కడే చిక్కుకుపోయారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్ నుంచి న్యూయార్క్, వాషింగ్టన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
భారీ మంచు కురుపుతో పాటు గాలివేగం పెరగడం వల్ల రహదారులు జారుగా మారి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టెక్సాస్, టెన్నెసీ రాష్ట్రాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమై, లక్షలాది మంది చీకట్లోనే గడుపుతున్నారు. విద్యుత్ లైన్లు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వల్ల పునరుద్ధరణ పనులు కూడా కష్టంగా మారాయి.
Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు
ఈ మంచు తుఫాన్ కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సేవలు హై అలర్ట్‌లో ఉండగా, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అమెరికా వాతావరణ శాఖ సూచించింది. “ఫెర్న్” ప్రభావం ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా.

