ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 28న నగరంలో జరిగే సదస్సులో పాల్గొననుంది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసింది. ఇవాంక ట్రంప్ భద్రతకు అమెరికా అధికారులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఐదంచెల రక్షణ వలయం ఏర్పాటు చేయడంతోపాటు.. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పట్నుంచి తిరిగి అమెరికా వెళ్లేంత వరకూ ఆమె భద్రతను అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లో పర్యటించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అమెరికా నుంచి ఉపగ్రహ వీక్షణ ద్వారా ఇక్కడి భద్రతను పర్యవేక్షించారు. ఇప్పటి ఇవాంక పర్యటనలో దానికి ఎన్నోరెట్లు మెరుగైన అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాంక కదలికలను నిరంతరం గమనించి రక్షించేందుకు 60 మంది అధికారులతో మూడు వేర్వేరు బృందాలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి.
మొదటి అంచె..ఇవాంకా ట్రంప్ భద్రత తొలి అంచె మూడు మీటర్ల దూరం నుంచి మొదలవుతుంది. ఈ వలయంలోని భద్రత అధికారులు అనూహ్యంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు మెరుపు వేగంతో స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకుంటారు. వీరి చేతులే ఆయుధాలు. గెరిల్లా యుద్ధ విద్యల్లో సుక్షితులైన వారు ఈ వలయంలో ఉంటారు. ఆమెకు ఐదు మీటర్ల పరిధిలో మరో భద్రత వలయం ఉంటుంది. ఈ వలయంలోకి ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ రానివ్వరు. క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్(సీపీటీ)గా అభివర్ణించే ఈ బృందంలో వీరితో పాటు కేంద్ర పారామిలటరీ విభాగం అధికారులు సంయుక్తంగా భద్రతను పర్యవేక్షిస్తారు. వీరిలోదుస్తుల్లో స్నైపర్ వంటి అత్యాధునిక ఆయుధాలుంటాయి.
ముప్పై అడుగుల వలయంలో… అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే ప్రాంతంలో ఈ భద్రత వలయం ఉంటుంది. సమావేశాల్లో పాల్గొనే వారిని వీరు నకశికపర్యంతం గమనిస్తూ ఉంటారు. దాదాపు ప్రతి ఒక్కరి రాకపోకలను క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు. గుర్తింపు కార్డులు లేని, చివరి నిముషంలో లోపలికి వెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోరు.
వంద మీటర్లు…వాహనాలు… అపరిచితులు నాలుగో అంచె భద్రతలో భాగంగా ఇవాంకాకు వంద మీటర్ల పరిధిలో 15 మందితో కూడిన భద్రత వలయం విధులు నిర్వహిస్తుంటుంది. వీరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి వాహనాల రాకపోకలు, అపరిచితులపై దృష్టి కేంద్రీకరిస్తారు. సదస్సు, సమావేశాలకు వందమీటర్ల దూరంలో ఏవైనా కొత్త వాహనాలు కనిపించినా, డ్రైవర్లు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినా గుర్తించి అదుపులోకి తీసుకుంటారు.
ఐదు అంచెల్లో అ‘మెరికలు’ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఐదో అంచె భద్రతా వ్యూహాన్ని ఐదువందల మీటర్ల దూరం నుంచి అమలు చేస్తారు. అమెరికాలో ఉంటూ ఉపగ్రహం ద్వారా ఇవాంక చుట్టూ ఉన్న పరిసరాలను గమనించే సిబ్బంది.. ఎప్పటికప్పుడు ఈ భద్రతా వలయం అధికారులతో మాట్లాడుతుంటారు. వారు చిత్రీకరించిన దృశ్యాలను ఇక్కడికి పంపుతారు. వాటిని తిలకించేందుకు వీలుగా వారు ట్యాబ్‌లను వినియోగిస్తారు.