రాష్ట్రంలో మరో 5 రోజులు భారీ వర్షాలు..

167
Heavy rains
- Advertisement -

గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ‌ ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొద్ది.. ద‌క్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో ఉత్తర, పరిసర మధ్య బంగళాఖాతంలో రాగల 48 గంటలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గ‌ఢ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 2.1 కి.మీ నుండి 3.6 కి.మీ మధ్య కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో ఈరోజు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, రేపు ఆదివారం భారీ వర్షాలు పడతాయని వివరించింది. అంతేకాదు, ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఆ అల్పపీడనం వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగ‌ల 5 రోజుల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

- Advertisement -