యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుబాయ్, అబుదాబీతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో సాధారణ జీవనం అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
భారీ వర్షాల నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని సూచించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యా సంస్థలకు కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు అడ్వైజరీ విడుదల చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా, విమాన ప్రయాణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మరో కొద్ది గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో యూఏఈలో హై అలర్ట్ కొనసాగుతోంది.
Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

