రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దైంది. ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుతుపవనాలకు తోడుగా అల్పపీడన ద్రోణి తోడవటంతో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. . చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది.
వరద నీటితో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు భారీగా వస్తుండడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సికింద్రాబాద్, పార్శీ గుట్ట, వారాసి గూడ, చిలకల గూడ, అల్వాల్, పద్మారావు నగర్, మారేడ్ పల్లి, బేగంపేట, బంజారాహిల్స్ , పంజాగుట్ట, బోయిన్ పల్లి, అడ్డగుట్ట, తిరుమలగిరి, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్ కేసర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతున్నది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతున్నది. అంబర్‌పేటలో అత్యధికం 6 సెం.మీ. వర్షం కురిసింది. ఇక ఎల్బీ నగర్, బండ్లగూడ, నారాయణగూడలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌లో 3 సెం.మీ. వర్షం కురిసింది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గార్ల, పాల్వంచ, పాలకుర్తి, కొత్తగూడెం, పర్వతగిరిలలో 6 సెం.మీ, దుమ్ముగూడెం, బయ్యారం, అశ్వారావుపేటల్లో 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.